రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మూ కశ్మీర్ లో ఆరెస్సెస్ అత్యంత కీలకమైన కార్యక్రమాలు చేపట్టింది. ఇంటింటికీ తిరిగి సంఘ్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి మూలకూ సంఘ్ భావజాలాన్ని తీసుకెళ్లి, జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో రానున్న రోజుల్లో బలోపేతం అవుతామన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సంఘ్ స్థాపన జరిగి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ ప్రచారం కూడా భాగమని పేర్కొంది.
జమ్మూ కశ్మీర్ ఆరెస్సెస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో జమ్మూ కశ్మీర్ ప్రాంత సంఘచాలక్ డాక్టర్ గౌతమ్ మేంగీ, సహ సంఘచాలక్ డాక్టర్ విక్రాంత్, ప్రాంత కార్యవాహ అవతార్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో సంఘ్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీడియాకి వెల్లడించారు.
వచ్చే విజయ దశమ నాటికి సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అన్ని ప్రావిన్సులలోనూ విస్తరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు.
అక్టోబర్ 2న ప్రావిన్సులలోని అన్ని మండలాలు, నగరాల్లో శాఖా కార్యక్రమాలు, శాఖా విస్తరణ, దృఢీకరణపై దృష్టి పెడతామన్నారు. అలాగే వివిధ రకాల సమావేశాలు, మేధో సమావేశాలతో పాటు సామాజిక సమరసతపై కూడా కార్యక్రమాలు వుంటాయని తెలిపారు. దేశంపై భక్తి, బాధ్యత పెరిగేలా ముఖ్యంగా యువత కేంద్రంగా కార్యక్రమాలను కూడా రూపకల్పన చేస్తామని ప్రకటించారు.
అలాగే ఇంటింటికీ తిరుగుతూ సంఘ సాహిత్యాన్ని కూడా పంచుతామని తెలిపారు. దీని ద్వారా సంఘ సిద్ధాంతం, దృష్టికోణం కూడా ప్రజలకు తెలుస్తుందన్నారు. శతాబ్ది పూర్తయ్యే నాటికి గరిష్టంగా అన్ని ప్రావిన్సులలోనూ సంఘ్ విస్తరణ జరిగేలా ముందుకు సాగుతున్నామన్నారు.
అయితే ఈ ప్రచార కార్యక్రమాలు కేవలం పట్టణ కేంద్రాలకే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరిస్తామని, సుదూర ప్రాంతాల్లోకి కూడా వెళ్తామన్నారు. అన్ని వర్గాలలో జాతీయవాద స్ఫూర్తిని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. అలాగే తప్పుడు కథన నిర్మాణాలను కూడా ఖండిస్తూ… అసలైన కథనాలను కూడా తెలియజేస్తామన్నారు.