వక్ఫ్ సవరణ బిల్లు 2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. గురువారం అర్ధరాత్రి దాటే వరకూ దీనిపై సభలో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. అటు ప్రభుత్వం పక్షాన సభ్యులు తమ చర్చను అత్యంత బలవంతంగా వినిపించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఆ చర్చను తమ స్థాయిలో చేశారు. మొదట కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. తర్వాత అధికార, విపక్ష సభ్యులు చర్చలో పాల్గొన్నారు.
తదనంతరం సవరణల వారీగా సభలో ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. దీంతో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.
ఇక… ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించడంతో ఇది ఇప్పుడు అధికారికంగా పార్లమెంటు ఆమోదం పొందింది. ఇప్పుడు చట్టంగా మారడానికి ముందు తుది ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది.
మరోవైపు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి.