1990లలో కంప్యూటర్ల ప్రభావం కొత్తగా మొదలైనప్పుడు అవి మన జీవితాలను ఎంతవరకు మార్చుతాయో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలు సంపాదన, కొనుగోలు శక్తిలో ఇంత అభివృద్ధి చెందడంలో కంప్యూటర్ విద్య మరియు ఉద్యోగాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే ప్రయాణం క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ – వేగవంతమైన విస్తరణ, గ్లోబల్ పార్టనర్‌షిప్‌లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా క్వాంటమ్ రంగాన్ని అందిపుచ్చుకుంటోంది. IBM తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని, అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో దేశంలోనే అతిపెద్ద 156-క్యూబిట్ IBM Quantum System–2 ను ఏర్పాటు చేయనుంది. ఇది 2026లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యంతో విద్యా, పరిశోధన కోసం IBM సంవత్సరానికి 365 గంటల ఉచిత క్వాంటమ్ యాక్సెస్ ఇస్తుంది.

ఇక అమరావతిలోనే భారతదేశపు తొలి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీను రూ.40 కోట్ల పెట్టుబడితో ప్రారంభించింది. ఇది టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్, సర్టిఫికేషన్ కోసం కీలక కేంద్రంగా నిలుస్తుంది. అదేవిధంగా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ రూ.200 కోట్లతో దేశంలోనే మొదటి క్వాంటమ్ క్రయోజెనిక్ కంపోనెంట్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్లకు అవసరమైన ముఖ్యమైన భాగాలను ఇక్కడ తయారు చేయనున్నారు.
అలాగే, బెంగళూరుకు చెందిన స్టార్టప్ QpiAI తో భాగస్వామ్యం కుదుర్చుకొని వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం వందకుపైగా యూజ్‌కేసులను రూపొందించింది. వాటిలో:

- వ్యవసాయం – క్వాంటమ్ అల్గారిథమ్‌లతో పంటల చీడపీడలను ముందుగానే గుర్తించడం
- నీటి నిర్వహణ – క్వాంటమ్ సిమ్యులేషన్లతో సమర్థవంతమైన వనరుల వినియోగం
- ఆరోగ్య సంరక్షణ – వ్యాధుల నిర్ధారణ, వైద్య సరఫరా వ్యవస్థలో వినియోగం
- విద్య – విద్యార్థులు, పరిశోధకులకు శిక్షణ, కొత్త అప్లికేషన్‌ల అభివృద్ధి కోసం Center of Excellence ఏర్పాటు
కర్ణాటక – స్వదేశీ ఆవిష్కరణలు, ఏకోసిస్టం నిర్మాణం
కర్ణాటక మాత్రం స్వదేశీ పరిశోధన, స్టార్టప్‌లపై ఆధారపడి ముందుకు సాగుతోంది. బెంగళూరులోని QpiAI అభివృద్ధి చేసిన 25-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ “Indus” ఏప్రిల్ 2025 నుంచి వాణిజ్య సేవలను అందిస్తోంది. ఇది ఆరోగ్య, రక్షణ, ఆర్థిక రంగాల్లో వినియోగంలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో వాణిజ్యంగా పనిచేస్తున్న తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఇదేనని కర్ణాటక చెబుతోంది.
అదేవిధంగా, సెప్టెంబర్ 2025లో బెంగళూరు సమీపంలోని హెసరగట్టలో “క్వాంటమ్ సిటీ” నిర్మాణానికి 6.17 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సిటీలో అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు, హార్డ్‌వేర్ క్లస్టర్లు, చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. దీన్ని బలోపేతం చేయడానికి రూ.1,000 కోట్ల క్వాంటమ్ మిషన్ వెంచర్ ఫండ్ను కూడా ప్రకటించారు. ఐఐఎస్సీతో కర్ణాటక ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తోంది.
పోటీలో భిన్న వ్యూహాలు
ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెడితే, కర్ణాటక దేశీయ ఆవిష్కరణలు, హార్డ్‌వేర్ అభివృద్ధి, దీర్ఘకాలిక ఎకోసిస్టంపై దృష్టి సారిస్తోంది. ఈ రెండు విభిన్న వ్యూహాలు చివరికి భారతదేశాన్ని ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ పటంలో అగ్రస్థానంలో నిలిపే అవకాశముంది.