హైదరాబాద్: ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) లో ప్రచారకులుగా, సేవకులుగా పనిచేసిన పలువురు సీనియర్ కార్యకర్తలు, ఇటీవల వామరాజు సత్యమూర్తి గారి నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వామరాజు సత్యమూర్తి గారు (మాజీ బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) తన అరెస్టు, జైలులో ఎదుర్కొన్న అనుభవాలు, ఆ సమయంలో సంఘం చేపట్టిన కార్యకలాపాలను వివరించారు.

భోజనపల్లి నరసింహమూర్తి గారు (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు) ఎమర్జెన్సీ సమయంలో గుంటూరు, విజయనగరం, ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో చేసిన సేవల అనుభవాలను పంచుకున్నారు.
ఉప్పలూరి నరసింహారావు గారు (జిల్లా ప్రచారకుడిగా పనిచేసినవారు, ఎల్ఐసి ఏజెంట్) సంఘ సేవలో ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు తెలిపారు.
నారాయణ శర్మ గారు అనకాపల్లి జిల్లా పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో చేసిన సేవల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
అన్నదాన సుబ్రహ్మణ్యం గారు (రిటైర్డ్ తెలుగు లెక్చరర్, తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖుడు) 1985లో నాగపూర్ తృతీయ వర్ష శిక్షక్ శిబిరంలో పాల్గొన్న అనుభవాలను వివరించారు.
పన్నాల విశ్వనాథ్ గారు గుంటూరు జిల్లాలో చేసిన సేవల గురించి వివరణ ఇచ్చారు. మల్లికార్జునరావు గారు గుంటూరులో అనేక సంవత్సరాల సేవల అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారని తెలిపారు.
ఈ సమావేశంలో మునుపటి ప్రాంత ప్రచారకులు మాననీయ సోంపల్లి సోమయ్య గారు, సోమయాజుల నాగేశ్వరరావు గారు, కోటేశ్వర శర్మ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా స్మరించుకున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. చివరగా సత్యమూర్తి గారి ఇంట్లో భోజనం అనంతరం, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకొని, భవిష్యత్తులోనూ సమాజ, ధర్మ సేవలో నిరంతరం కృషి చేయాలని సంకల్పించారు.