ఒక పోలిక కాదు, ఇది ఒక పాఠం …
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మరియు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) — ఈ రెండు సంస్థలు 1925లోనే పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థగా, మరొకటి రాజకీయ పార్టీగా ఎదిగాయి. ఈ సంవత్సరం ఈ రెండు సంస్థలు తమ శతాబ్ది వేడుకలు జరుపుతున్నాయి. ఈ మధ్య , “వారెక్కడ, మనెక్కడ?” అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. ఈ ఆలోచన సామాజిక వామపక్ష వాదులలో ఎక్కువగా ప్రతిధ్వనిస్తున్నది .
ఈ మాటలు దేశవ్యాప్తంగా వినిపించినప్పటికీ, విజయవాడలోని సిద్ధార్థ్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) 29వ వార్షిక సమావేశంలో ఇవి ప్రత్యేకంగా ప్రతిధ్వనించాయి. ఆ వేదికపై కొన్ని ప్రకటనలు, వినిపించగా, “రాజ్యాంగంపై విశ్వాసం లేకుంటే విప్లవ మార్గమే సరైనది” అనేది, “ఆయుధ పోరాటాలు ప్రజాస్వామ్య పరిష్కారం” అనే నినాదాలు కూడా వినిపించాయి. అయితే, ఆ వేదికపై నిలిచిన వ్యక్తల నుండి “రాజ్యాంగ పద్ధతిలోనే పోరాటం చేయాలి” అనే తార్కిక సూచనలు రాలేదు.
విరసం వేదికలో ఇదేమి కొత్తది కాదు. ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇక్కడే ఇలాంటి అభిప్రాయాలతో సమావేశాలు జరిగాయి. అప్పటి నుంచి ఈ వేదికలో పునరావృతమయ్యే పదబంధాలు, శబ్దాలు కొంతమంది మార్పులతో ఉన్నప్పటికీ, తమ స్వంత సారాంశాన్ని మార్చుకోలేదు. నేటి రాజకీయ విమర్శనలు కూడా అదే లక్ష్యాలపై దృష్టి పెట్టాయి — నిన్న కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు ఈ రోజు బీజేపీపైకి మారాయి. నిన్న ఇందిరాగాంధీని “ఫాసిస్ట్” అని పిలిచినట్లే, నేటి మాటల్లో మోదీపై కూడా అదే ధోరణి కనిపిస్తుంది.
అయితే, కొంతమంది వక్తల మాటలు ఆశాజనకంగా నిలిచాయి. ఉదాహరణకు, రాంకీ అనే వ్యక్తి “వారు – మేము 1925లోనే ప్రారంభమయ్యాము — కానీ ఇప్పుడు వారు ఎక్కడ, మనం ఎక్కడ?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలో కమ్యూనిస్టులు మరియు ఆర్‌ఎస్‌ఎస్ మధ్య తేడాలు, వాటి సామాజిక-రాజకీయ ప్రభావాలను పోల్చి చూపారు. రాంకే ప్రశ్న ఒక నిరూపణ కోసమే — మన భావజాలం మన ఇళ్లలో, మన పరిసరాల్లో ఎంతవరకు ఆమోదించ బడుతున్నది అన్నదే ప్రశ్న?
ఒక ఉదాహరణ: అయోధ్యలో రామమందిరం నిర్మాణ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ “ఇంటింటా దీపాలు వెలిగించండి” అనే పిలుపునిచ్చింది. కమునిస్టులు దానికి వ్యతిరేక ప్రచారం చేశారు , కానీ ఒక యువకుడు ప్రశ్నించాడు — “ఎందుకు వెలిగించకూడదని ? మేము రోజూ దీపాలు వెలిగిస్తున్నాం. ఈ రోజు కొంచెం ఎక్కువ వెలిగించటం లో తప్పేమిటి?” ఈ ప్రశ్నకు సమగ్రమైన సమాధానం మన దగ్గర ఉందా? ఇది తార్కికంగా పరిశీలించాల్సిన అంశం అన్నాడు రాంకీ .
విరసం వేదికపై జరిగిన చర్చలు లోతైనవి కావని, సభ్యుల మనస్సులను తెరవడానికి సహాయపడలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, కార్పొరేట్ హిందుత్వం, ఫాసిజం, ఆదివాసులపై హింసను ఖండించడం వంటి నినాదాలు స్పష్టంగా వినిపించాయి. “నర్మదా” అనే యువతి విప్లవ ఉద్యమాల్లో మహిళలను ఎలా ఉపయోగిస్తారో, అవమానిస్తారో తీవ్రంగా ఆరోపించింది. ఆ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేయడంతో, ఆ సంఘటనపై తీవ్రమైన చర్చ జరగకపోవడం మన ముందు ప్రశ్నలను మిగిలిస్తుంది.
కమ్యూనిస్ట్ పార్టీ తన చారిత్రక తప్పులకు సంబంధించి స్పష్టంగా అంగీకరించకపోవడం తరచుగా విమర్శలకు గురవుతుంది. చరిత్రకారుడు రామచంద్ర గుహ తన వ్యాసంలో (“ది టెలిగ్రాఫ్”, 12 జూన్ 2004) “ఎర్రజెండా”కు సంబంధించిన ఆరు ప్రధాన తప్పులను వివరించాడు. కార్మిక, విద్యార్థి ఉద్యమాలపై నాయకత్వం వహించిన కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయిందని విశ్లేషించాడు. ఈ తప్పుల వల్ల ప్రజాదరణ తగ్గిందని అతను పేర్కొన్నాడు.
మరోవైపు, ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించిన విద్యార్థి-కార్మిక సంఘాలు, వారి విద్యార్థి విభాగాలు ఎన్నికల్లో విజయం సాధించడం వంటి విషయాలు చర్చకు పరిష్కారాలను అందిస్తున్నాయి. రాజకీయ విజయం, స్థానిక ప్రభావం యువతరంలో కనిపించడం ఆశ్చర్యకరం కాదు.
చారిత్రకంగా పెద్ద పార్టీలు ఒకప్పుడు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కానీ నేటి పరిస్థితులు మారిపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్ పునాదిపై పుట్టిన బీజేపీ రాజకీయ విజయాలు సాధించటం తో పాటు , సామాజిక ప్రభావం, ప్రజాదరణలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టులు “ఈ విషయాలపై సరైన విశ్లేషణ చేయాలి” అని సభ్యులు పట్టు బట్టారు . కానీ ఆ పరిష్కారాలను అమలు చేయడంలోని సవాళ్లు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వ్యక్తిగత స్థాయిలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. చంద్ర రాజేశ్వరరావు కుమారుడు తన తండ్రి రచనలు, వారి దినపత్రికలోని గమనాలను గుర్తుచేసుకున్నాడు. ఆ డైరీలో “ప్రజలు విశ్వసించే విషయాలను మేము సరిగ్గా అందించలేదు. అందుకే ప్రజలు మమ్మల్ని మద్దతు ఇవ్వడం లేదు” అనే భావన వ్యక్తమైందని పేర్కొన్నాడు. కమ్యూనిస్టుల ఆలోచనల్లో మార్పులు అవసరమని వ్యక్తం చేశారు.
“వారెక్కడ — మనెక్కడ?” అనే ప్రశ్న కమ్యూనిస్ట్ సిద్ధాంతకారుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోయింది. చారిత్రకంగా తప్పులు, వర్గ విభజనలు, దశల వారీ తప్పులను గుర్తించి, వాటిని అధిగమించడానికి ధైర్యం ఉందా? పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి దశాబ్దంలో తప్పు నిర్ణయాలు తీసుకుని, పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ప్రజాసంపర్కంలో తగిలిన దెబ్బలను ఎలా సారి చేస్తారు అన్నదే ప్రశ్న ?
ఈ ప్రశ్నలు మన ముందు తరచుగా వస్తున్నాయి. చివరగా ఏమిటంటే దేశభక్తి, ప్రజాస్వామ్యం, భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం అన్ని రకాల భావజాలాలు కలిసి పనిచేయాలి, పలు సంఘాలు సమన్వయంతో ముందుకు రావాలి. ముందు కు దూసుకు పోతున్న సంఘాలను అడ్డగోలుగా వ్యతిరేకించ కుండా , వాటి నుండి ప్రేరణ పొంది ప్రజల విశ్వాసాలకు పెద్ద పీట వేయాలి, వ్యక్తిగత, సామాజిక రాజకీయ తప్పులను సమీక్షించి, వాటిని సరిదిద్దుకోవడానికి అందరూ ప్రయత్నించాలి, దాని వల్ల దేశానికి మేలు కలుగుతుంది.
**జై హింద్ — జై భారత్.**
డాక్టర్ కాకాని పృథ్వీ రాజు