బంగ్లాదేశ్ హిందువులు ఐక్యంగా నిలబడాలి

ప్రపంచ హిందువుల మద్దతు మీకు ఉంటుంది : డా. మోహన్ భగవత్

బంగ్లాదేశ్‌లో సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న హిందువుల భద్రత, హక్కుల అంశంపై Rashtriya Swayamsevak Sangh సర్ సంఘచాలక్  Sri Mohan Bhagwat ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని హిందువులు ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ముంబైలో నిర్వహించిన “100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం – న్యూ హారిజన్స్” అనే రెండు రోజుల ఉపన్యాస శ్రేణిలో భాగంగా ఆదివారం మాట్లాడిన ఆయన, బంగ్లాదేశ్‌లో సుమారు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. అక్కడి హిందువులు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు తప్పకుండా లభిస్తుందని స్పష్టం చేశారు.

హిందువులు ఏకమైతే, అక్కడి రాజకీయ వ్యవస్థను తమ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం వినియోగించుకోవచ్చని డా. భగవత్ తెలిపారు. ఇందుకు ఐక్యతే ప్రధాన బలమని, వారు ఎంత త్వరగా ఏకం అవుతారో అంత మంచిదని సూచించారు. ఈసారి బంగ్లాదేశ్ హిందువులు అక్కడి నుంచి పారిపోకుండా, అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే, వారు తమ పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకోగలరు. దీనికోసం మా పరిమితులకు లోబడి మేము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ తమ స్థాయిల్లో చేయగలిగిన సహాయాన్ని అందిస్తాం. ఈ హామీని నేను ఇస్తున్నాను,” అని ఆయన భరోసా ఇచ్చారు.

భారతదేశంలోని మైనారిటీ అంశాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు జనాభా మార్పులు, అక్రమ వలసలు, కొన్ని వర్గాల్లో అధిక జననాల రేటు వంటి విషయాలను సకాలంలో గుర్తించలేదని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందిస్తూ, తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

సంఘ్ కార్యకలాపాలు, భవిష్యత్ దిశ, సామాజిక సామరస్యం గురించి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌లో నాయకత్వ నిర్ణయాల్లో కులానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని డా. భగవత్ స్పష్టం చేశారు. సంఘ్‌లో వ్యక్తి యోగ్యతను వారి పని, అంకితభావాన్ని బట్టి మాత్రమే నిర్ణయిస్తారని తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా సర్ సంఘచాలక్ కావచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ అన్ని వర్గాలను ఏకం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థను బ్రాహ్మణులు ప్రారంభించినా, ఎవరైనా నాయకత్వ బాధ్యతలు చేపట్టవచ్చని తెలిపారు.

నిధుల అంశంపై స్పందిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల నుంచే నిధులు సేకరిస్తామని, హోటళ్లలో ఉండకుండా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తామని చెప్పారు. తమకు అధికారం అవసరం లేదని, సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యమని వివరించారు.

తన వయస్సును ప్రస్తావిస్తూ, 75 ఏళ్లు పూర్తయిన తర్వాత అధికారిక పదవులకు విరమణ చేయాలనుకున్నానని, కానీ సహచరుల అభ్యర్థన మేరకు ఇప్పటికీ బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. “పదవికి విరమణ చేయొచ్చు, కానీ పనికి కాదు. చివరి రక్తపు బొట్టు వరకు సమాజం కోసం పని చేయాలి,” అని ఆయన అన్నారు.

ముస్లిం సమాజంతో సంబంధాలపై మాట్లాడుతూ, సహజీవనం, సామాజిక సామరస్యం అవసరమని నొక్కి చెప్పారు. నాలుక పళ్ల మధ్యకు వచ్చినా పళ్లు విరగవని ఉపమానంతో, విభేదాలను శత్రుత్వం లేకుండా పరిష్కరించుకోవాలని సూచించారు. ముస్లింలు భారతీయ సమాజంలో అంతర్భాగమని, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు వారి మధ్య పనిచేస్తున్నారని తెలిపారు.

మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన దేవుడిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని, అయితే బలవంతంగా లేదా ప్రలోభాలతో మత మార్పిడులు జరగకూడదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ‘ఘర్ వాపసీ’ జరుగుతుందని, అది సహజ ప్రతిస్పందనగా భావించాలన్నారు.

జాతీయ ఐక్యతపై మాట్లాడుతూ, “2047లో అవిభక్త భారతదేశాన్ని ఊహించుకోండి” అని పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించలేవని హెచ్చరించారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top