కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకులు అధికారంలోకి వచ్చినందున సమస్యలన్నీ స్వయంచాలకంగా పరిష్కారమవుతాయని, వారిపై బాధ్యతలు వదిలేసి మనం నిశ్చింతగా ఉండవచ్చనే భావన ప్రజల్లో కనిపిస్తోందని సామాజిక సమరసత మంచ్ అఖిల భారత సంయోజక్ కె. శ్యాం ప్రసాద్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని PGRRCDE ఆడిటోరియంలో “మారుతున్న నక్సలిజం రంగులు” అనే శీర్షికతో Martyrs’ Memorial Research Institute (MMRI) ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
దేశంలో సమర్థవంతమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, కొన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయని అంగీకరిస్తూనే, ప్రధాని లేదా ముఖ్యమంత్రి చేతిలో తాళం వేస్తే అన్నీ సర్దుబాటు అవుతాయనే ఆలోచన సరైనది కాదని శ్యాం ప్రసాద్ సూచించారు. దేశంలో సైద్ధాంతిక సంఘర్షణ ఇంకా ముగియలేదని, మరో 25 ఏళ్లపాటు ఇది కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ, ఆ అవగాహనతో ప్రజలు జాగరూకతతో ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పదవులు లేకపోయినా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టవచ్చని, మాజీ డీజీపీ అరవిందరావు ఉదాహరణగా చూపారు. పదవీ విరమణ తర్వాత కూడా అరవిందరావు హిందూ సమాజానికి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. అర్బన్ నక్సలైట్లను మహాభారతంలోని శకునితో పోల్చిన శ్యాం ప్రసాద్, శకుని యుద్ధవీరుడిగా, వ్యూహకర్తగా కౌరవులు-పాండవుల మధ్య సంఘర్షణకు కారణమయ్యాడని, అదే విధంగా అర్బన్ నక్సలైట్లు సమాజంలో విభేదాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వీరిని అమాయకులుగా భావించడం తప్పని, వీరి వెనుక పెద్ద బుద్ధిజీవుల సమూహం పనిచేస్తోందని హెచ్చరించారు.
2007లో దలైలామా భారత్ సందర్శన సందర్భంగా బౌద్ధ ధర్మం, సనాతన ధర్మం ఒకే వృక్షానికి చెందిన రెండు కొమ్మలని వ్యాఖ్యానించగా, వరంగల్‌లో వరవరరావు ధర్నా చేసిన సంఘటనను శ్యాం ప్రసాద్ గుర్తు చేశారు. అయితే, ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో దేశ-విదేశాల నుంచి వచ్చిన 300 మంది బౌద్ధ భిక్షువులు తొలిసారి పవిత్ర స్నానం చేసి, సనాతన స్వాముల ఆతిథ్యాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ బౌద్ధ భిక్షువులు కూడా దలైలామా మాటలను ధ్రువీకరిస్తూ రెండు ధర్మాలు ఒకే మూలానికి చెందినవని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ ఐక్యత కోసం ఎంతో కృషి జరిగిందని, అదే విధంగా రైతులు, కూలీలను సైద్ధాంతికంగా వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ వ్యవసాయం బాగుండాలంటే ఇరువర్గాలూ కలిసి పనిచేయాలని నొక్కి చెప్పారు. సమాజంలో సరైన భావజాలం అవసరమని అన్నారు. 1969లో శ్రీకాకుళంలో నక్సలైట్లు తాము చంపాలనుకున్న వ్యక్తి దొరకనప్పుడు ఇందువదన నాయుడు అనే మరో వ్యక్తిని చంపిన ఘటనను గుర్తు చేస్తూ, సిద్ధాంతంలోనూ, అమలులోనూ జరిగిన తప్పిదాలను వివరించారు. కుల సమానత్వ విషయంలోనూ ఇటువంటి పరిస్థితి ఉందని, దీనికి పరిష్కారంగా సమాజంలోని లోపాలను సైద్ధాంతికంగా, కార్యరూపంలో సరిచేయాలని సలహా ఇచ్చారు.
సదస్సులో మాజీ డీజీపీ కె. అరవిందరావు మాట్లాడుతూ, నక్సల్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది పోలీసులు, అమాయక ప్రజలకు శ్రద్ధాంజలి ఘటించారు. 1984లో వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో నక్సల్ ఉద్యమంలో సహేతుకత లేని విధానాలను గమనించినట్లు చెప్పారు. పోలీసుల్లో కొందరిలో నక్సల్ సానుభూతి, జడ్జీల్లో పోలీసులపై ప్రతికూల దృక్పథం ఉండేదని వెల్లడించారు. నక్సలైట్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల సమయంలో ఈశాన్య భారతంలోని ఉగ్రవాదుల విధానాలను అనుసరించారని, ఆ సమయంలో డబ్బు వసూళ్లు కూడా జరిగాయని తెలిపారు. అర్బన్ నక్సలిజం అనే పదం కొత్తగా వచ్చినప్పటికీ, ఆ భావన చాలా కాలంగా సమాజంలో ఉందని వివరించారు. బాహ్య శక్తులు అంతర్గత శక్తులతో కలిసి దేశాన్ని అస్థిరపరిచేందుకు పనిచేస్తున్నాయని హెచ్చరించారు.