మన నిత్యజీవితంలో వ్యక్తులు తమ తమ ప్రయోజనాలకే పరిమితమై, సామాజిక సంబంధాలు సడలిపోతున్న ఈ కాలంలో శ్రావణ పౌర్ణమి మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజు. విదేశీ దాడులు, ఆత్మవిస్మృతి కారణంగా శతాబ్దాల పాటు మనం అస్తిత్వ పోరాటం సాగించాము. ఈ క్రమంలో సామాజిక బంధాలు బలహీనపడ్డాయి. వాటిని పునరుద్ధరించడానికి, సామరస్యాన్ని పెంపొందించడానికి రక్షా బంధన్ ఒక చక్కటి పండుగ.
రక్షా బంధన్ కేవలం సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలను బలపరచడమే కాదు, కుటుంబ విలువలను, సమాజ రక్షణ భావనను, సనాతన సంస్కృతిని కాపాడుతూ ప్రపంచ శాంతి, మానవతా అభ్యుదయానికి ప్రేరణనిస్తుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ పండుగ ద్వారా సమాజంలో ఐక్యత, పంచ పరివర్తన అవసరాన్ని గుర్తు చేస్తుంది. సంఘం శతాబ్ది సందర్భంగా ఈ ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
1. కుటుంబ ప్రబోధం
కుటుంబ వ్యవస్థ మన జాతీయ జీవితానికి మూలస్తంభం. పూర్వులు ఏర్పాటు చేసిన నియమాలు అమూల్యమైనవి.
- పెద్దల సేవాభావం, పూర్వీకుల గొప్పతనం గురించి పిల్లలకు తెలియజేయాలి.
- ఇంట్లో సత్ప్రవర్తన, భోజన సమయంలో కనీసం ఒక పూట అయినా కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేయాలి.
- మాతృభాషను ప్రేమించి, వినియోగాన్ని ప్రోత్సహించాలి.
- భారతీయ వేషధారణ ఆరోగ్యానికి, మానసిక సమతుల్యతకు మేలు చేస్తుంది.
- గృహాన్ని పవిత్రంగా, శాంతి కేంద్రంగా, సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దాలి.
- పొదుపు అలవాటు, పేదలను ఆదుకునే మనస్తత్వం పెంపొందించాలి.
2. పర్యావరణ సంరక్షణ
అభివృద్ధి పేరిట ప్రకృతిని దెబ్బతీయడం మానవుని భవిష్యత్తుకు ముప్పు.
- కోరికలను తగ్గించుకోవడం ద్వారా ప్రకృతి దోపిడీ తగ్గుతుంది.
- భోగవాదం హింసకు దారి తీస్తే, త్యాగం శాంతిని ఇస్తుంది.
- వాతావరణ మార్పులు, అడవుల నాశనం, కాలుష్యం వంటి సమస్యలు మనకే ముప్పు.
- ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.
- పుట్టినరోజు వంటి సందర్భాల్లో మొక్కలు నాటి సంరక్షించాలి.
- ప్రకృతి మనకిచ్చిన వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
3. సమరసత
సమాజంలో అసమానతలు, అస్పృశ్యత వంటి దురాచారాలను పూర్తిగా నిర్మూలించాలి.
- “అస్పృశ్యత తప్పు కాకపోతే మరేదీ తప్పు కాదు” అని స్వీకరించాలి.
- ధర్మ గురువులు, పండితులు ప్రజలకు సమానత్వ భావనను బోధించాలి.
- అన్ని వర్గాల హిందువులను సంఘటితం చేయడం సంఘం లక్ష్యం.
- ప్రాచీన సత్యాలను కాలానుగుణంగా ప్రజలలో చేర్చే విధంగా ధర్మాచార్యులను ప్రోత్సహించాలి.
4. స్వదేశీ
విదేశీ పాలకుల అణచివేతతో భారత్ వెనుకబడినా, స్వదేశీ మార్గం ద్వారా స్వావలంబన సాధ్యమే.
- స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం, స్థానిక ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం అవసరం.
- ధర ఎక్కువైనా నాణ్యత, స్వాభిమానం కోసం స్వదేశీని ఎంపిక చేసుకోవాలి.
- భారతీయ టెక్నాలజీ, భాష, వేషధారణ, ఆహారం, నిర్మాణాలు, హస్తకళలను అభివృద్ధి చేయాలి.
5. పౌర విధులు
మన దేశం హక్కుల కంటే విధులకు ప్రాధాన్యం ఇచ్చింది.
- రోడ్డు నియమాలు పాటించడం, ప్రభుత్వ విధానాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత.
- కుటుంబ నియమాల్లాగే, దేశ నియమాలను కూడా స్వయంగా క్రమశిక్షణతో పాటించాలి.
- బాధ్యతలు నిర్వర్తించినప్పుడే హక్కులు రక్షింపబడతాయి.
పూజ్య సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జి భాగవత్ అనేక సందర్భాల్లో పేర్కొన్నట్లుగా, ఈ ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సమాజంలో మంచి దిశ కలగడానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాలు ఒక సువర్ణావకాశం.