భారత రాజ్యాంగం ఎంతో దూరదృష్టి, సుదీర్ఘ ఆలోచనల ఫలితమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రాభివృద్ధికి రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతోందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంపై గర్వపడుతున్నామని, దీనిని మరింతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు మన రాజ్యాంగం బలాన్ని మరింతగా స్పష్టంచేస్తున్నాయని పేర్కొన్నారు. “నేపాల్‌లో రాజకీయ అస్థిరత కనిపిస్తోంది, బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి” అని ఆయన ప్రస్తావించగా, జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రాల బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీం కోర్టుకు ఉందా అనే అంశంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయం కోరిన నేపథ్యంలో ఈ కేసు పరిశీలనలోకి వచ్చింది.
సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. విచారణలో మాట్లాడుతూ జస్టిస్ గవాయ్, ప్రజలపై ప్రభావం చూపే చట్టాల విషయంలో రాష్ట్రపతికి సుప్రీం కోర్టు సలహా కోరే హక్కు ఉందని స్పష్టం చేశారు.