నిప్పుతో చెలగాటమాడొద్దు.. యూనస్‌కు హసీనా హెచ్చరిక

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌ చర్యలను మాజీ ప్రధాని షేక్ హసీనా దుయ్యబట్టారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా వర్చువల్‌గా మాట్లాడారు. ఈసందర్భంగా యూనస్‌ను స్వార్థపూరిత రుణదాత అని దుయ్యబట్టారు. ‘‘బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి అన్ని గుర్తులను చెరిపేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారు. వారికి గుర్తుగా అన్ని జిల్లాల్లో నిర్మించిన భవనాలను తగలబెడుతున్నారు. ఈ చర్యలను యూనస్ సమర్థించుకుంటున్నారా..? మీరు నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్ని దహించివేస్తుంది. ఆ వడ్డీ వ్యాపారి, అధికార, ధన దాహం కలిగిన స్వార్థపరుడు విదేశీయులతో కలిసి కుట్ర పన్నాడు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ సంపదను ఉపయోగించాడు. అక్కడి రాజకీయ పార్టీలు అవామీ లీగ్ నాయకులపై దారుణాలకు ఒడిగడుతున్నాయి’’ అని మండిపడ్డారు.

గతంలో కూడా ఆమె ఈతరహా వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. త్వరలో బంగ్లాకు తిరిగి వస్తానని అన్నారు. ‘‘ఒక్క రోజులోనే నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడేమో. అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు. నేను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తా’’ అని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే.. హసీనాపై అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అరెస్టు వారెంట్ జారీ అయింది.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top