1 డిసెంబర్ 2025 గుంటూరు :
సోమవారం నాడు ఆరోగ్య భారతి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలోని విజేత స్కూల్‌లో ఆరోగ్య భారతి అవగాహన కార్యక్రమం జరిగింది. ఆరోగ్య జీవన శైలి గురించి మాట్లాడటానికి ఆరోగ్య భారతి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాకాని పృథ్వీరాజు గారు, ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజేత స్కూల్ డైరెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీహరి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించి, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు.

మొదటగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఏ ఆహారాల్లో ఉంటాయి, బయట తినే ఆహారం వల్ల కలిగే నష్టాలు ఏమిటి వంటి విషయాలను వారు చాలా స్పష్టంగా వివరించారు. పిల్లలు ఇంటరాక్టివ్ ద్వారా అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

తరువాత డాక్టర్ కాకాని పృథ్వీరాజు గారు మాట్లాడుతూ, మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. కేవలం ఆహారం మాత్రమే కాదు, మనసు నిర్మలంగా ఉంచుకోవడం, భావోద్వేగాలను నియంత్రించడం, మంచి సాన్నిహిత్యం కలిగిన వారితో కలవడం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమని వివరించారు. శరీరానికి ఇమ్యూనిటీ పెరగడానికి యోగాభ్యాసం, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఇలా ప్రతిరోజూ సాధన చేస్తే ఏకాగ్రత పెరిగి, చదువులోను, పరీక్షలలోను మెరుగైన ఫలితాలు సాధించగలమని చెప్పారు. ప్రాణాయమము , ధ్యానము పై శిక్షణ ఇచ్చారు పిల్లలతో చేయించారు.

కార్యక్రమం ముగింపు వరకు పిల్లలు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా పాల్గొని, ఆరోగ్య జీవన శైలిపై విలువైన జ్ఞానాన్ని పొందారు.










