హైదరాబాద్, జూలై 15: భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం (BTUF) సమ్మిట్–2026 విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా **”హైదరాబాద్ డిక్లరేషన్”**ను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ, కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సంభాషణ, స్థిరమైన అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల ట్రేడ్ యూనియన్లు తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు పరస్పర విశ్వాసం, సంభాషణ, సహకారంతో పనిచేసినప్పుడే పారిశ్రామిక కుటుంబ భావన సాకారమవుతుందని పేర్కొన్నారు. సాంకేతికత మానవాళికి సేవ చేయాలని, అసమానతలు పెంచకుండా గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా ఉపయోగపడాలని ఆయన సూచించారు.

బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వాటాను కలిగి ఉన్నాయని, సమతుల్యమైన, సమ్మిళితమైన, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఈ దేశాలు ముఖ్యపాత్ర పోషించగలవని గవర్నర్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పరివర్తన, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచ కార్మిక మార్కెట్‌ను వేగంగా మార్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు శ్రీ ఎస్. మల్లేశం మాట్లాడుతూ, ఈ సదస్సులో నాలుగు ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని తెలిపారు. అవి:
- అందరికీ సార్వత్రిక సామాజిక భద్రత
- మహిళా కార్మిక సాధికారత
- స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్
- మానవ కేంద్రిత కృత్రిమ మేధస్సు (AI) మరియు శ్రమ భవిష్యత్తు
ఈ అంశాలపై జరిగిన చర్చల సారాంశమే హైదరాబాద్ డిక్లరేషన్ అని ఆయన వివరించారు.
బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు భారతీయ మజ్దూర్ సంఘ్‌ను అభినందించారు. కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, గౌరవప్రదమైన ఉపాధి, సమ్మిళిత అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని వారు పునరుద్ఘాటించారు.
సదస్సు ముగింపులో భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కోశాధికారి శ్రీ అనీష్ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతాలాపనతో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026 ఘనంగా ముగిసింది.