‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల వేడుకల్లో ఘన నివాళులు – దేశభక్తి భావనను యువతలో పెంపొందించాలని పిలుపు
విజయవాడ, జూలై 17: సుప్రసిద్ధ నేపథ్య గాయని శ్రీమతి ఎస్. జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె మధుర గానామృతం ఈ ప్రపంచం ఉన్నంతకాలం మారుమ్రోగుతూనే ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి, భాషా–సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాన కోకిల ఎస్. జానకి స్మృత్యంజలి కార్యక్రమంతో పాటు, కేంద్ర సంగీత నాటక అకాడమీ, భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వందేమాతరం – 150 సంవత్సరాల వేడుకలు’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళావేదికలో ఏర్పాటు చేసిన ఎస్. జానకి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభలో పాల్గొన్న వారితో కలిసి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్యోద్యమానికి అపార స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ గీతం కోట్లాది భారతీయుల్లో దేశభక్తిని రగిలించి, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచిందన్నారు. నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ అనేక మంది అమరవీరుల త్యాగఫలమని ఆయన గుర్తు చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రచన ఆధారంగా దర్శకులు ఫణీంద్ర మరియు ఎమ్.ఎస్. చౌదరి నేతృత్వంలో రూపొందించిన “అమరావతికి ఆమడ దూరంలో వందేమాతరం గర్జన” సాంఘిక నాటకాన్ని మంత్రి వీక్షించి కళాకారులను అభినందించారు. జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. సంగీతం, నాటకం, లలిత కళలు వంటి సాంస్కృతిక మాధ్యమాల ద్వారా జాతీయ భావాన్ని బలోపేతం చేయడం సమాజ అభివృద్ధికి అవసరమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణను, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎస్.పి. భారతిని మంత్రి ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమం ముగింపులో మంత్రి కందుల దుర్గేష్ సభికులతో కలిసి సగర్వంగా “వందేమాతరం” అని నినదించి దేశభక్తి సందేశాన్ని చాటిచెప్పారు.