గుంటూరు.18 డిసెంబర్ 2025 :
డ్వార్ఫ్ గెలాక్సీలో (Dwarf Galaxy) బ్లాక్ హోల్ ఉనికిని గుర్తించిన పరిశోధనతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర వర్గాల్లో విశేష గుర్తింపు పొందిన యువ శాస్త్రవేత్త డా. పూచా రాగదీపిక ఇటీవల భారతదేశానికి చేరుకుని, స్వస్థలం తెనాలిలో ఘన స్వాగతం పొందారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ యుటా (University of Utah) భౌతికశాస్త్ర–ఖగోళ శాస్త్ర విభాగంలో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న రాగదీపిక, డ్వార్ఫ్ గెలాక్సీల్లోని తక్కువ బరువున్న బ్లాక్ హోల్స్‌పై చేసిన పరిశోధనలకు గాను అనేక అంతర్జాతీయ అవార్డులు, ఫెలోషిప్‌లు అందుకున్నారు. ఆమె పరిశోధనల్లో ప్రధానంగా DESI (Dark Energy Spectroscopic Instrument) ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించి, గెలాక్సీ పరిణామాన్ని అధ్యయనం చేయడం విశేషం.

భారత పర్యటనలో భాగంగా డా. రాగదీపిక
ఖాజీపాలెం కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన పరిశోధనలో కీలకంగా ఉపయోగించిన DESI స్పెక్ట్రోమీటర్ గురించి వివరిస్తూ, డ్వార్ఫ్ గెలాక్సీల్లో బ్లాక్ హోల్‌ను ఎలా గుర్తించారో సులభమైన భాషలో వివరించారు. ఖగోళ శాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం ఆమె ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) భౌతిక శాస్త్ర విభాగంలో కూడా ఉపన్యాసం ఇచ్చి, పరిశోధన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవికుమార్ గారు, ప్రొఫెసర్ సంధ్య గారు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఖాజీపాలెం కార్యక్రమంలో కృష్ణం రాజు గారు ఆమెను ఆహ్వానించి సత్కరించారు.

ఈ రెండు కార్యక్రమాల్లోనూ డా. రాగదీపికను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో ఆమెకు తల్లిదండ్రులు కూడా తోడుగా ఉండి, ఈ విజయయాత్రకు మరింత భావోద్వేగాన్ని జోడించారు.
ఈ మొత్తం పర్యటనకు, ఉపన్యాసాల ఏర్పాట్లకు డాక్టర్ కాకాని పృథ్వి రాజు గారు ప్రత్యేకంగా కృషి చేశారు. ఆయన సమన్వయంతో విద్యార్థులు, అధ్యాపకులు ఒక అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తతో నేరుగా మమేకమయ్యే అరుదైన అవకాశం లభించింది.

డ్వార్ఫ్ గెలాక్సీలను ఉపయోగించి గెలాక్సీ పరిణామం, బ్లాక్ హోల్స్ వృద్ధి వంటి అంశాలపై రాగదీపిక చేస్తున్న పరిశోధన, భవిష్యత్తులో ఖగోళ శాస్త్రానికి కొత్త దారులు చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు జిల్లా ముద్దుబిడ్డగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ యువ శాస్త్రవేత్త, అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నారు.






