ఉదయ్‌పూర్: భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ చికిత్స మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాలను పరిష్కరించే సమగ్ర ఆరోగ్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ హరిదాస్జీ కి మగ్రిలో సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వైద్య ఆరోగ్య కేంద్రంతో పాటు సంస్థ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా భయ్యాజీ జోషి మాట్లాడుతూ, భారతీయ జీవన విధానం, వాతావరణం, ఆహారపు అలవాట్లు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన ప్రకృతి వైద్య విధానం ప్రజల ఆరోగ్యానికి మరింత అనుకూలమని చెప్పారు. ప్రతి ప్రాంతం భౌగోళిక, సాంస్కృతిక ప్రత్యేకతలకు అనుగుణంగా ఆరోగ్య సేవలు అందించే సంస్థలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు.
మానసిక ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యం
ఆరోగ్యవంతమైన శరీరంతో పాటు ఆరోగ్యకరమైన మనస్సు కూడా సమానంగా ముఖ్యమని భయ్యాజీ జోషి అన్నారు. మనస్సు ఆరోగ్యం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, భవిష్యత్ ఆరోగ్య విధానాల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రతి దేశానికి ప్రత్యేక ఆరోగ్య విధానం అవసరం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి ఒకే వ్యవస్థ ప్రపంచంలోని అన్ని దేశాల అవసరాలను సమర్థవంతంగా తీర్చలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి ప్రత్యేక సంస్కృతి, ఆహార విధానం, వాతావరణం, జీవనశైలి ఉంటాయని, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య విధానాలు రూపుదిద్దుకోవాలని సూచించారు.
అన్ని వైద్య విధానాల సమన్వయమే సమగ్ర ఆరోగ్యానికి మార్గం
భారతదేశంలో సుమారు 150 రకాల వైద్య విధానాలు అమలులో ఉన్నాయని పేర్కొన్న భయ్యాజీ జోషి, ఏ ఒక్క వైద్య విధానం అన్ని వ్యాధులకు సంపూర్ణ పరిష్కారం కాదన్నారు. వివిధ వైద్య విధానాల్లోని సానుకూల అంశాలను సమన్వయం చేసి సమగ్ర ఆరోగ్య వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కేవలం 10 శాతం మందికే సూపర్-స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు ధరలో అందించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, సేవా సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు.
సేవాభారతి సేవలు ఆదర్శప్రాయం
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా మాట్లాడుతూ, యోగా శరీరానికీ, మనస్సుకూ సానుకూల శక్తిని అందిస్తుందని చెప్పారు. ఎలాంటి ప్రచార ఆశ లేకుండా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న సేవా భారతి కృషిని ఆయన అభినందించారు. మానవ సేవే మాధవ సేవ అని పేర్కొంటూ, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ విలువల పరిరక్షణ, అవసరంలో ఉన్నవారికి సేవ, కులవివక్ష రహిత సమాజ నిర్మాణం ద్వారా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఆధునిక సదుపాయాలతో ప్రకృతి వైద్య కేంద్రం
సేవా భారతి ప్రారంభించిన ఈ ప్రకృతి వైద్య ఆరోగ్య కేంద్రంలో యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఆక్యుప్రెషర్, స్పైనల్ బాత్స్ (వెన్నెముక స్నానాలు), ఫిజియోథెరపీ వంటి పలు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ కార్యక్రమంలో పసిఫిక్ మెడికల్ కాలేజ్ చైర్మన్ రాహుల్ అగర్వాల్, ధరోహర్ ఛారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ సంజయ్ సింఘాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సావినా బాల సంస్కార్ కేంద్రానికి చెందిన బాలికలు దేశభక్తి గీతాన్ని ఆలపించగా, సేవా భారతి చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.