నంబూరు, గుంటూరు జిల్లా:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్‌ఆర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్టీ: ఆరోగ్య సేవల అందుబాటు మరియు సామాజిక-ఆర్థిక ప్రభావం – 2026 (ఇతర రాష్ట్రాల ప్రత్యేక సూచనతో)” అనే అంశంపై జాతీయ సెమినార్ విజయవంతంగా ముగిసింది. రెండవ రోజు కార్యక్రమాలు సాంకేతిక సమావేశాలు మరియు నిపుణుల ప్రసంగాలతో ఉత్సాహభరితంగా సాగాయి.

ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. గంగాధర్ రావు, రెక్టర్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, OSD రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ న్యూరాలజిస్ట్, గుంటూరు లలితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ పి. విజయ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి మరియు సెంట్రల్ GST అదనపు కమిషనర్ బి. లక్ష్మీ నారాయణ (IRS), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఏ.బి. హర్షవర్ధన్, మాజీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య, సంధ్యా ఐ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భార్గవ్ రామ్ మునుగపాటి, NRI మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ శాంసన్ సంజీవరావు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు టాక్సేషన్ నిపుణులు శ్రీ కె.వి. బ్రహ్మం, శంకర రామకృష్ణ, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రముఖ న్యాయకోవిదుడు శ్రీ గొర్రముచ్చు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు మూడవ సాంకేతిక సమావేశంలో జీఎస్టీ మరియు ఆరోగ్య బీమా రంగం – ప్రీమియాలు, క్లెయిమ్స్ మరియు కవరేజ్; జీఎస్టీ అనుసరణ, డిజిటల్ పరిపాలన మరియు ఆరోగ్య సంస్థలు” అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ పీ. శ్రీనివాస్ రావు అధ్యక్షత వహించగా, విజయవాడకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ ఎస్. రామకృష్ణ గారు మరియు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ టీ & డీ జోనల్ హెడ్ శ్రీ కమడా చంద్రశేఖర్ గారు నిపుణులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణ గారు “జీఎస్టీ 2.0” సామాజిక, ఆర్థిక శక్తివంతీకరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే చంద్రశేఖర్ గారు ఆరోగ్య సేవలపై వ్యక్తిగత ఖర్చులు తగ్గడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని వివరించారు.

తదుపరి నాలుగవ సాంకేతిక సమావేశంలో జీఎస్టీ మరియు ఆరోగ్య రంగ అభివృద్ధి, మెడికల్ టూరిజం, పెట్టుబడి విధాన రోడ్‌మ్యాప్ మరియు భవిష్యత్ సంస్కరణలు” అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆర్. రమాకాంత్ గారు ఆసుపత్రుల్లో డేటా డిజిటలైజేషన్ అత్యవసరమని తెలిపారు.
సంధ్యా గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ భార్గవ రామ్ మునుగపాటి గారు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో కూడా ముందుకు రావాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 అమలు ద్వారా ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా వైద్య సేవలు, ఔషధాలు మరియు అనుబంధ సేవలపై పన్ను విధానం సరళీకరణతో ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఆమె వివరించిన ప్రకారం, జీఎస్టీ వ్యవస్థ ద్వారా ఆరోగ్య సేవల వ్యయంపై నియంత్రణ సాధ్యమైందని, దీనివల్ల ప్రజలపై పడే ఆర్థిక భారం కొంత మేర తగ్గుతున్నదని తెలిపారు. అలాగే, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఆరోగ్య రంగంలో మరింత పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

డాక్టర్ విజయ గారు ఇంకా మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే విధాన పరమైన మార్పులతో పాటు ప్రజల్లో అవగాహన కూడా అవసరమని స్పష్టం చేశారు.

తదనంతరం జరిగిన ప్రత్యేక నిపుణుల సమావేశంలో జీఎస్టీ: న్యాయ మరియు రాజ్యాంగ పరమైన దృక్కోణాలు” అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ కే. అబ్రహాం లింకన్ అధ్యక్షత వహించగా, డాక్టర్ డేవిడ్ రాజ్ గారు పన్నుల ప్రాముఖ్యతను వివరించారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సీనియర్ న్యాయవాది శ్రీ గోరెముచ్చు శాంతకుమార్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు ఆరోగ్యం, జీవనోపాధి వంటి మౌలిక అవసరాలు అందుబాటులో ఉండేలా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రూపకల్పన చేశారని తెలిపారు.
అలాగే “జీఎస్టీ 2.0” కొంతవరకు సఫలీకృతమైందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పెట్రోల్, మద్యం, బంగారం, ఏవియేషన్ ఇంధనం వంటి ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేవని, వాటిని కూడా జీఎస్టీ 2.0లో చేర్చితే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని పేర్కొన్నారు.

మొత్తంగా ఈ జాతీయ సెమినార్ ఆరోగ్య రంగంలో జీఎస్టీ ప్రభావంపై విస్తృత చర్చలకు వేదికగా నిలిచింది.

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *