సమగ్ర ఆరోగ్యంపై నిపుణుల సందేశం
5 ఏప్రిల్ 2026, గుంటూరు.
స్థానిక అరండల్పేటలోని యోగీ భవన్‌లో ఈరోజు నిర్వహించిన మధుమేహ అవగాహన సదస్సు విశేష స్పందన పొందింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సదస్సును ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ బి.వి. కశ్యప జన్నాభట్ల నిర్వహించగా, కార్యక్రమాన్ని ఆరోగ్య భారతి గుంటూరు అధ్యక్షులు డాక్టర్ శంకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజు సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదని, మనసు, బుద్ధి, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ కలిసి సమగ్ర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని తెలిపారు. ఆహారపు అలవాట్లు, నిద్ర సమయం, జీవన విధానం వంటి అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఒక్క కారణం ఆధారంగా వైద్య నిర్ధారణ చేయడం సాధ్యం కాదని, వ్యక్తి పరిస్థితులు, మనస్తత్వం, జీవనశైలిని సమగ్రంగా పరిశీలించి వైద్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అనంతరం డాక్టర్ కశ్యప మధుమేహంపై విపులంగా వివరించారు. ఒకప్పుడు “జువెనైల్ డయాబెటిస్”గా పిలిచిన వ్యాధిని ప్రస్తుతం టైప్-1, టైప్-2 డయాబెటిస్‌గా వర్గీకరిస్తున్నారని తెలిపారు. హెచ్‌బీఏ1సీ స్థాయిల ఆధారంగా మధుమేహం గుర్తించబడుతుందని, 5.6 లోపు ఉంటే సాధారణం, 5.6 నుంచి 6 మధ్య ఉంటే ప్రీ-డయాబెటిస్, 6.5 కి పైగా ఉంటే డయాబెటిస్‌గా పరిగణిస్తారని వివరించారు. ప్రీ-డయాబెటిస్ దశలోనే నియంత్రణ తీసుకోకపోతే భవిష్యత్తులో మధుమేహానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆహారపు అలవాట్లపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ, పిండిగా మార్చిన ఆహార పదార్థాలు గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతాయని తెలిపారు. ఉదాహరణకు రాగులు సహజ రూపంలో తినడం మంచిదని, కానీ రాగి జావ వంటి పిండి రూపంలో తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి మధుమేహ రోగులకు హానికరమవుతుందని చెప్పారు.

వృద్ధాప్యంలో ముఖ్యంగా 60 సంవత్సరాల తర్వాత మజిల్ లాస్ ఎక్కువగా జరుగుతుందని, మజిల్ మాస్ ఎక్కువగా ఉంటే శరీరంలో గ్లూకోజ్ వినియోగం మెరుగవుతుందని వివరించారు. అందుకే ఈ వయస్సులో మసిల్ వ్యాయామాలు చేయడం అవసరమని సూచించారు. అలాగే రోజుకు కనీసం 6 గంటల పాటు, అంతరాయం లేకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి అత్యంత కీలకమని చెప్పారు.
సదస్సులో పాల్గొన్న ప్రేక్షకుల ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇచ్చారు. ఆరోగ్య భారతి ప్రతి నెల ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల ఏప్రిల్ 26న యోగీ భవన్‌లో “కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్” పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు డాక్టర్ కాకాని పృథ్వీరాజు తెలిపారు. గృహ వైద్యం, యోగా అంశాలపై కూడా అవగాహన కల్పిస్తామని, ప్రజలు ఎక్కువగా పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. డా కె శంకర రెడ్డి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది


