ప్రకృతి వ్యవసాయం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పీఎండీఎస్ (PMDS) నమూనా క్షేత్రాలను ఆయన సందర్శించి పంటల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, ప్రకృతి వ్యవసాయ విధానాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
పీఎండీఎస్ విధానంలో విత్తన గుళికల (Seed Pellets) ద్వారా సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం నమోదవడంతో పాటు మొక్కలు సమానంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా నేలలో తేమ నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల నీటి వినియోగం తగ్గి పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితుల కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో రైతులు పీఎండీఎస్ విధానంతో పాటు అంతర పంటల సాగును చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని స్థిరమైన దిగుబడులు సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
రైతులు తమ వ్యవసాయ భూములను బీడుగా ఉంచకుండా ఏడాది పొడవునా వివిధ పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేయాలని సూచించారు. దీనివల్ల నేల సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎంఈఓ-ఓఎస్ (NMEO-OS) పథకం కింద రైతులకు 100 శాతం రాయితీపై సోయాబీన్ విత్తనాలు, పీఎండీఎస్ కిట్లు, సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, నేల ఆరోగ్యం, రైతుల ఆర్థికాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం అనే నాలుగు ముఖ్య లక్ష్యాలను ఒకేసారి సాధించవచ్చని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.