నెల్లూరు, జూలై 28: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి బస్తీలో స్వస్థ కుటుంబాల సంఖ్యను పెంచడమే ఆరోగ్య భారతి ప్రధాన లక్ష్యమని ఆరోగ్య భారతి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి డా. మురళీకృష్ణ అన్నారు.
నెల్లూరు నగరంలో గత మూడు సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తల కోసం జూలై 28న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు నగర అభ్యాస వర్గం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి డా. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

ఈ అభ్యాస వర్గంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం, ప్రాంత సహసదస్సుల ప్రముఖులు డా. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీ మధుసూదన్ రెడ్డి, నగర కార్యదర్శి శ్రీ చారి, మహిళా ప్రముఖ శ్రీమతి అరుణ పాల్గొన్నారు. నాలుగు బస్తీలకు చెందిన 30 మంది పురుషులు, 17 మంది మహిళలు కలిపి మొత్తం 47 మంది కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. మురళీకృష్ణ మాట్లాడుతూ, ఆరోగ్య భారతి ప్రధానంగా పాజిటివ్ మరియు ప్రమోటివ్ హెల్త్ భావనతో పనిచేస్తోందన్నారు. వ్యక్తి వయస్సు, వృత్తి, ప్రవృత్తి, శారీరక ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి కుటుంబంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం ద్వారా స్వస్థ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.

ప్రతి బస్తీలో కార్యకర్తలను కేంద్రంగా తీసుకుని 10 నుంచి 15 కుటుంబాలను ప్రతి నెల సందర్శించి, ఆరోగ్య సూత్రాలను వివరించాలని, ఆ కుటుంబాలకు ఆరోగ్య సూత్రాలు పొందుపరిచిన స్టిక్కర్ను అందించి ఇంటి ముందు అతికించేలా చేయాలని సూచించారు. వికేంద్రీకృత విధానంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించడం ద్వారా స్వస్థ కుటుంబాల సంఖ్యను గణనీయంగా పెంచాలని పిలుపునిచ్చారు.
రాబోయే డిసెంబర్ నెలలో కనీసం 300 మంది పాల్గొనేలా ఆరోగ్య సమ్మేళనం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
జిల్లా అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గృహ వైద్యం (హోమ్ రెమెడీస్) ప్రాముఖ్యతను వివరిస్తూ, సాధారణ ఆరోగ్య సమస్యలకు ఇంటి వద్దే అందుబాటులో ఉండే సహజ చికిత్సా విధానాలను కార్యకర్తలకు వివరించారు.
కార్యక్రమం ముగింపులో అందరూ కలిసి 20 నిమిషాల పాటు ప్రాణాయామ అభ్యాసం నిర్వహించి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పించారు.