న్యూఢిల్లీ: వైద్యులు–డయాగ్నస్టిక్ కేంద్రాల మధ్య జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ‘కట్ మనీ’ లేదా రిఫరల్ కమీషన్ పద్ధతిని తక్షణమే అరికట్టాలని బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో డిమాండ్ చేశారు.
డయాగ్నస్టిక్ పరీక్షల ఖర్చులో రిఫరల్ కమీషన్లను కలిపి రోగులపై 15–20 శాతం వరకు అదనపు భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు. ఉదాహరణగా రూ.9,000 విలువైన MRI పరీక్షలో సుమారు రూ.3,000 వరకు రిఫరల్ కమీషన్‌గా వెళ్లే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
కొంతమంది వైద్యులు తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించే ఇతర డయాగ్నస్టిక్ కేంద్రాల్లో రోగులు పరీక్షలు చేయించుకుని తీసుకువచ్చిన రిపోర్టులను తిరస్కరించి, తమకు అనుబంధంగా ఉన్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు చేయించుకునేలా సూచిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని చద్దా పేర్కొన్నారు. సరైన రిపోర్టులను కూడా తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యానిస్తూ, మళ్లీ పరీక్షలు చేయించడం ద్వారా రోగులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి కమీషన్లు వైద్య నైతికతకు విరుద్ధమని, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలు వైద్యులు రిఫరల్‌కు ప్రతిఫలంగా కమీషన్లు, బహుమతులు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు స్వీకరించడాన్ని నిషేధిస్తున్నాయని చద్దా తెలిపారు.
కొన్ని డయాగ్నస్టిక్ కేంద్రాలు రోగుల రిఫరల్స్ కోసం వైద్యులకు విదేశీ పర్యటనలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ విధానంపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని అన్నారు.
వైద్యులు నిర్దిష్ట డయాగ్నస్టిక్ కేంద్రానికే వెళ్లాలని ఒత్తిడి చేయడం, ఇతర కేంద్రాన్ని ఎంచుకుంటే అసహనం వ్యక్తం చేయడం వంటి అంశాలను రోగులు కూడా గమనించాలని చద్దా సూచించారు.
వైద్యులందరినీ లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశం కాదని, అయితే రోగులపై అనవసరమైన పరీక్షల భారం మోపే రిఫరల్ కమీషన్ వ్యవస్థను అరికట్టడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. వైద్య వృత్తి నైతిక ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, రోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
https://whatsapp.com/channel/0029Va7vAawBqbrAGlo3km1X
